27.6 C
Hyderabad
Wednesday, September 30, 2026

అభినవ పోతన వానమామలై వరదాచార్యుల 115వ జయంతి..ఉపాధ్యాయుడి నుండి శాసనమండలి వరకు…

Must read

📰 Generate e-Paper Clip

భీంగల్ పట్టణానికి చెందిన కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు,ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని శ్రీరామ్ నగర్ రెండో వీధిలో తెలంగాణ గర్వించదగిన మహాకవి,అభినవ పోతన,కవి చక్రవర్తి, విధ్వత్కవి, అభినవ కాళిదాసు,మధురకవి వానమామలై వరదాచార్యుల జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత వనమామలై వరదాచార్యుల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ వానమామలై వరదాచార్యులు నాటి వరంగల్ జిల్లా హనుమకొండ మండలం మడికొండ గ్రామంలో ఒక రైతు కుటుంబంలో 1912 ఆగస్టు 16వ తేదీన సీతమ్మ, బక్కయ్య శాస్త్రిలకు జన్మించారు.వరదాచార్యులు కేవలం 7వ తరగతి వరకే చదువుకున్నారు.ఆయన సహజ పాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వులతో నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాల అధికారి (కార్యనిర్వహణాధికారి)గా నియమించారు. తర్వాత చెన్నూరు ఉన్నత పాఠశాలకు బదిలీ అయి 13 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1972లో పదవీ విరమణ పొందారు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. చెన్నూరులో వేద పాఠశాల నెలకొల్పారు. వారి ప్రత్యేక ఆసక్తితో తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో పాండిత్యం గడించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నుండి విశారదా పట్టా పొందారు. హరికథ గానంలో కూడా ప్రవీణులు. వరదాచార్యులకు కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది. దైవభక్తి, దేశభక్తి రంగరించిన కవిత్వంతో ఆయన చిర కీర్తి పొందారు. 1972లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు వరదాచార్యులను శాసనమండలికి నామినేట్ చేశారు.1978 వరకు శాసనమండలి సభ్యుడిగా విశిష్ట సేవలు అందించారు.64కు పైగా గ్రంథాలు రచించారు. దేశభక్తి గళాన్ని తన కలం ద్వారా వినిపించారు. పాకిస్తాన్, చైనా యుద్దాలప్పుడు సమయ సందర్భ సమర కవితలెన్నో రాశారు. కాశ్మీర్ ను లాక్కోవాలని పాక్ కుతంత్రాలు పన్నినప్పుడు చలించిపోయి ఆవేశంతో “ఖబడ్దార్ పాక్! కాశ్మీరం మాదేనోయ్!”అని నినదించారు.1950లో వానమామలై క్షయ వ్యాధికి గురై ఊపిరితిత్తులకు పలుసార్లు శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. అయినా ఒక ఊపిరితిత్తి తీసివేయాల్సి వచ్చింది. సుదీర్ఘకాలం ఒకే ఊపిరితిత్తి తోనే ఉండి 1984 అక్టోబర్ 31న పరమపదించారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ ఉపాధ్యక్షుడు తీగల రఘు,డప్పు ప్రశాంత్, కత్రాజ్ శ్యామ్ రాజ్,నిచ్చెమోల్ల మహేష్,కొండ సాయికిరణ్,గజ్జెల భరత్, రాంగిరి ఆనంద్,సున్నపు సాయికుమార్,కొండ సాయికిరణ్,నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.