26.9 C
Hyderabad
Wednesday, August 12, 2026

అర్హులైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కును కోల్పోవద్దు -ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఆర్) ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.

మంగళవారం మెండోరా, బాల్కొండ, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ మండలాల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించిన ఆయన, సంబంధిత తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమావేశమై ఎస్ ఐ ఆర్ నమోదు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల నమోదు, మ్యాపింగ్, డిజిటలైజేషన్, అలాగే డెత్, డబుల్, షిఫ్టెడ్ (ఏ ఎస్ డి) వివరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిందని వివరించగా, నమోదైన వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా ‘నో మ్యాపింగ్’, డెత్, డబుల్, షిఫ్టెడ్ (ఏ ఎస్ డి) కేటగిరీల్లో నమోదైన ప్రతి కేసును పునఃపరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గంలో ప్రస్తుతం సగటున 89 శాతం మేర ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ పూర్తయిందని పేర్కొన్న ఆయన, ఈ శాతం కంటే తక్కువగా నమోదు జరిగిన పోలింగ్ బూత్‌ల జాబితాను సంబంధిత తహసీల్దార్లకు అందజేసినట్లు తెలిపారు. ఆయా బూత్‌లలో నమోదు శాతం తగ్గడానికి గల కారణాలను గుర్తించి, మిగిలిన అర్హులైన ఓటర్లకు ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా 2002 నుంచి ఇప్పటివరకు ‘నో మ్యాపింగ్’ ఓటర్లు 5 శాతానికి మించి ఉన్న పోలింగ్ బూత్‌లు, అలాగే ‘పెర్మినెంట్ షిఫ్టింగ్’ 5 శాతానికి మించి నమోదైన బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించి మరోసారి ధృవీకరణ చేపట్టాలని సూచించారు. సాంకేతిక లోపాలు లేదా సమాచార పొరపాట్ల వల్ల నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.

మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇంకా నమోదుకాని అర్హులైన ఓటర్లను గుర్తించి, బిఎల్ఏ లు, బిఎల్ఓ లు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి వంద శాతం ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. “అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగలకూడదు. ప్రతి ఓటరి హక్కు పరిరక్షించబడాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం” అని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దానిని పరిరక్షించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పురోగతిని నిరంతరం పరిశీలిస్తూ, ఓటర్ల జాబితాలోని లోపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇదే విధంగా వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అందేలా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.