మెండోరాలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం
మెండోరా: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఉపవాస దీక్షలు ఆచరించి, విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే పాప విమోచనం కలిగి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. చాతుర్మాస దీక్షలు కూడా ఈ రోజునే ప్రారంభమవుతాయి.
ఈ సందర్భంగా మెండోరా మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించి, తమ కుటుంబాల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, కోరుకున్న మనోరథాల సాధన కోసం స్వామివారికి విన్నవించుకున్నారు.
ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలను అందజేసి, దర్శనం సాఫీగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది.




