ఎల్లంపల్లి–వరద కాలువ–ఎస్‌ఆర్‌ఎస్‌పీ అనుసంధానంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతోంది.
మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే నేడు వేలాది మంది రైతులకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా ముందుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు, వరద కాలువ మరియు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల అనుసంధానం వల్ల ప్రస్తుతం వరద జలాలను ఎస్‌ఆర్‌ఎస్‌పీకి తరలించడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.
ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి సమృద్ధిగా నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే చెరువులను కూడా నింపే అవకాశం ఏర్పడి, భూగర్భ జలాలు పెరిగి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
వరద కాలువలో నిరంతరం నీటి ప్రవాహం ఉండటం వల్ల బోర్లు, బావుల్లో నీటి మట్టాలు పెరిగి వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వరద కాలువ ద్వారా నీటిని తరలించే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిందని, దాని ఫలితాలను నేడు రైతులు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని ముత్యం రెడ్డి అన్నారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి బలమైన పునాదిగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.




