subhodayam.news
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 8:53 pm Digital Edition : Jindham Narahari

భద్రాచలం మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి సేవలు అభినందనీయం…

భద్రాచలం:మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి శ్రీనివాసరావు అందించిన సేవలు అభినందనీయమని పలువురు విద్యాశాఖ అధికారులు,ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొనియాడారు.ఈ నెల 30న ఆయన పదవీ విరమణ చేయనున్న సందర్భంగా భద్రాచలం మండల విద్యా వనరుల కేంద్రంలో సోమవారం ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జి.జాన్సన్ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి శ్రీనివాసరావు చక్కటి పరిపాలన అందించారని,విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు.విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉపాధ్యాయులు,విద్యార్థులకు అందుబాటులో ఉంటూ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.

మాజీ మండల విద్యాశాఖ అధికారి టి.రమ మాట్లాడుతూ బెక్కంటి శ్రీనివాసరావు సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యంగా మండలంలో కేవలం రెండు నెలల వ్యవధిలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ (FLN) కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో ఆయన చేసిన కృషి అమోఘమని ప్రశంసించారు. విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత,సంఖ్యా పరిజ్ఞానం పెంపొందించే కార్యక్రమాల అమలులో ఆయన చొరవ అభినందనీయమని తెలిపారు.

ఈ సందర్భంగా బెక్కంటి శ్రీనివాసరావును శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా అభినందించారు.పదవీ విరమణ అనంతరం ఆయన సుఖసంతోషాలతో,ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కుర్రాజులగుట్ట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. లక్ష్మీనారాయణ,జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. రమ, యూపీఎస్ జగదీష్ కాలనీ ప్రధానోపాధ్యాయులు రాజా శ్రీనివాస్,వివిధ ఉపాధ్యాయ సంఘాల ముఖ్య నాయకులు,ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.