subhodayam.news
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 6:34 pm Digital Edition : Jindham Narahari

లింగంపేట్ మండల అభివృద్ధి అధికారి మీసాల బ్రహ్మానందరావు సేవలు మరువలేనివి…

ఆర్మూర్:మున్సిపల్ పరిధిలోని ఎమ్మార్ గార్డెన్ లో వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామ వాస్తవ్యులు మీసాలు బ్రహ్మానందరావు ప్రస్తుతం మండల అభివృద్ధి అధికారిగా లింగంపేట్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు.ఈ నెల 31వ తేదీన “ఉద్యోగ విరమణ” పొందుతున్న సందర్భంగా ఆత్మీయ బంధువులు,మిత్రులు, శ్రేయోభిలాషులందరి సమక్షంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సన్మాన గ్రహీత దంపతులు మీసాల బ్రహ్మానందరావు – సతీమణి ఉమాదేవి దంపతులను పూలు చల్లుతూ వేదిక పైకి ఆహ్వానించారు.అతిథుల ఆహ్వానం తర్వాత ప్రముఖ పూజారి నాగేశ్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం,ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించి,జ్యోతి ప్రజ్వలన గావించారు.రిటైర్డ్ టీచర్ జింధం నరహరి రూపొందించిన అభినందన నామాక్షరమాలను సన్మాన గ్రహీతచే ఆవిష్కరింపజేసి, సమన్వయకర్తలుగా వ్యవహరించిన జిందం నరహరి,రాములు ఆయన జీవిత విశేషాలను చదివి వినిపించారు.

తన స్వగ్రామ లక్కోర సర్పంచ్ దాసరి అపర్ణ-రాజు సభాధ్యక్షత వహించగా ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ శ్రీనివాసచారి ట్రెజరర్ రమణ,రిటైర్డ్ ఎంఈవో యు.సాయన్న, అల్జాపూర్ రమేష్,చాదల్ రాజేందర్,రిటైర్డ్ హెడ్మాస్టర్ మీసాల రాజేంద్రప్రసాద్,గురుజ్ఞాన్ విద్యానికేతన్ కరస్పాండెంట్ మీసాల రాజరాజేశ్వర్,మరాఠా బాలాజీ రావు,మరాఠా వినోద్ పవార్ పాల్గొని అంకితభావంతో 38 వసంతాలుగా విధులు నిర్వహించి,అవినీతి రహిత పాలన అందించిన సన్మాన గ్రహీత మీసాల బ్రహ్మానందం రావు సేవలను కొనియాడారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ అనారోగ్యంతో తండ్రి మీసాల రాజారాం మరణానంతరం దర్పల్లి మండలంలో జూనియర్ అసిస్టెంట్ గా ప్రారంభమైన తన ఉద్యోగ ప్రస్థానం మోర్తాడ్,బాల్కొండ,నాగిరెడ్డిపేట్,వేల్పూర్,ఆర్మూర్ మండలాలలో సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది,చివరి మజిలీగా లింగంపేట్ లో ఎంపీడీవోగా పదోన్నతి పొంది,ఈ నెల 31వ తేదీన “ఉద్యోగ విరమణ”పొందుతున్నారని,వారు ఎక్కడ పనిచేసినా అంకితభావంతో ప్రభుత్వ పథకాలకు జీవం పోసి,అభివృద్ధి సంక్షేమ పథకాలకు పట్టం కట్టి,ఉత్తమ సూపరింటెండెంట్ గా మాజీ మంత్రివర్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కలెక్టర్ లచే ప్రశంసా పత్రాలు పొందారు.ఉద్యోగ విరమణ సందర్భంగా వచ్చిన ఆత్మీయులందరూ సన్మాన గ్రహీత దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సన్మాన గ్రహీత మీసాల బ్రహ్మానందరావు మాట్లాడుతూ తాను ఎక్కడ పని చేసిన అంకితభావంతో ప్రజల పక్షాన నిలబడ్డానని,ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చుగలిగానని,ఉద్యోగిగా తన విద్యుక్త కర్తవ్యాన్ని నిర్వహిస్తూ భక్తి తత్పరతతో 18సార్లు అయ్యప్ప దీక్షబూని శబరిమలైకి వెళ్లి వచ్చానని,ఏలాంటి రిమార్కులు లేకుండా 38 వసంతాలుగా ఉద్యోగాన్ని పూర్తి చేశానని, దీనికి ఉద్యోగుల సహకారం ప్రజల విశ్వాసమే అన్నారు.తన క్లాస్మేట్స్,బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని, ఈ “ఉద్యోగ విరమణ” కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.