subhodayam.news
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 3:42 pm Digital Edition : RAJU CH

“ప్రతిపక్షంపై విమర్శలు కాదు.. పెండింగ్ పనులు పూర్తి చేయించండి: బీఆర్‌ఎస్ సూచన”

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి.. విమర్శలు కాకుండా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ముత్యాల సునీల్‌కు సూచన

మెండోరా :మెండోర మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన పూర్తి బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలోనే మెండోర వంటి మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి, దాదాపు 90 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారని తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత మిగిలిన పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం కంటే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి పెండింగ్ పనులను పూర్తి చేయించాలని కాంగ్రెస్ నాయకుడు ముత్యాల సునీల్ కుమార్‌కు సూచించారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలోనే కాకుండా అధికారుల దృష్టికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుల సమస్యలు, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి, ధాన్యం కొనుగోలు, విద్యాసంస్థల అభివృద్ధి వంటి ప్రజా సమస్యలను నిరంతరం తీసుకెళ్తున్నారని తెలిపారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యే చేతిలో నిధులు, అధికారాలు ఉండవని, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసే బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వానిదేనని శేఖర్ రెడ్డి అన్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వం విడుదల చేసే నియోజకవర్గ అభివృద్ధి నిధులను వినియోగించి పెండింగ్ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

మెండోర మండలం నేడు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా మెండోర మండలానికి కొత్తగా ఏ అభివృద్ధి పనులు చేశారో ప్రజలకు చెప్పాలని శేఖర్ రెడ్డి ప్రశ్నించారు.

అదేవిధంగా, వరుసగా మూడు ఎన్నికల్లో ప్రజలు వేముల ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి తమ విశ్వాసాన్ని చాటారని, ముత్యాల సునీల్ కుమార్‌ను ప్రజలు రెండుసార్లు తిరస్కరించారనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు బదులుగా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు.

మెండోరతో పాటు బాల్కొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, వాటిని మరింత ఆలస్యం చేయకుండా అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మెండోర మండల బీఆర్‌ఎస్ నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.