subhodayam.news
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 12:42 pm Digital Edition : RAJU CH

ప్రశాంత్ రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకోవాలి: ముత్యాల సునీల్ కుమార్

మెండోర డబుల్ బెడ్‌రూమ్ గృహాలను పరిశీలించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్

మెండోరా: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మంగళవారం మెండోర మండల కేంద్రంలోని రెండు పడక గదుల గృహ సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2017 మే నెలలో ప్రారంభమైన డబుల్ బెడ్‌రూమ్ గృహాల నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడం దురదృష్టకరమని అన్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఐదేళ్లు మంత్రిగా, అనంతరం మూడేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ గృహాల నిర్మాణాన్ని పూర్తిచేయించడంలో విఫలమయ్యారని విమర్శించారు. గృహ సముదాయానికి కనీస రహదారులు, సరైన డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదని ఆరోపించారు.

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేయడం సరైన విధానం కాదని అన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై మండల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తే, వాటిపై కూడా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం బాధ్యతాయుతమైన వైఖరి కాదని అన్నారు. “ఆయన పని చేయరు.. పని చేసేవారిని కూడా చేయనివ్వరు” అని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారం కోరితే ఎలాంటి భేషజాలు లేకుండా పూర్తి సహకారం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.