మెండోరా: భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపే మహనీయుడే గురువని ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ తెలిపారు. ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకునే గురు పౌర్ణమి గురు పరంపరను స్మరించుకునే పవిత్రమైన పర్వదినమని, ఈ రోజున గురువులను పూజించడం ద్వారా విద్య, విజ్ఞానం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతాయని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా మెండోరా మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు అనంతరం పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు.
ఈ పల్లకి సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాదం మరియు ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా సాగింది.