subhodayam.news
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 10:47 am Digital Edition : RAJU CH

యూరియా అప్‌ను వెంటనే రద్దు చేయాలని బిఆర్ఎస్ నాయకుల ధర్నా

మెండోరా: రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా బుకింగ్ యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ నాయకులు పోచంపాడు ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. యాప్ కారణంగా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాంకేతిక సమస్యల వల్ల చాలామంది రైతులు యూరియా పొందలేకపోతున్నారని నాయకులు ఆరోపించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు సులభంగా ఎరువులు అందేలా గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూరియా పంపిణీలో పారదర్శకతతో పాటు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాప్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో బిఆర్ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.