ఖద్దరు చొక్కాలు… ఆఫీస్ లో ఫ్యాన్ల కింద బాతఖానిలు… చుట్టూ మంది మార్బలంతో తమ ఉనికిని చాటుకునే ప్రజా ప్రతినిధులు ఉన్న ఈ రోజుల్లో… ప్రజలకు కష్టం వస్తే తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వొంటి చేత్తో అగ్ని మంటలను ఆర్పి వేసిన సర్పంచు ఉదంతమిది.
బాల్కొండ పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా ఉష్ణోగ్రత 45 నుండి 46 డిగ్రీల పైన ఎండలు ఉంటున్నాయి. ఈ దశలో బాల్కొండ మండలంలోని జలాల్పూర్ పంట పొలాల్లో సోమవారం సాయంత్రం పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దాదాపు 40 ఎకరాల గడ్డివాములు ఈ అగ్ని కీలలకు ఆహుతి అయ్యాయి. ఈ మంటలు పక్కనే ఉన్న ఎయిర్టెల్ టవర్కు అంటుకొని భారీ నష్టం వాటిల్లే ప్రమాదము ఉండడంతో స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ఒక్కడే రంగంలోకి దిగి నీటి పైపులతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సర్పంచ్ ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.


