subhodayam.news
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 7:09 pm Digital Edition : RAJU CH

కుల గణనపై సుప్రీంకోర్టు తీర్పుకు స్వాగతం

–ఓబీసీ మహిళలకు సబ్ కోట అమలు చేయాలి : దాసరి మూర్తి

దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుల గణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం బీసీల విజయం అని పేర్కొన్నారు.

దేశంలోని ఓబీసీలకు ఈ తీర్పు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. జనగణనలో కులాల లెక్కింపుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంక్షేమ పథకాల సమర్థ అమలుకు దోహదపడుతుందని చెప్పారు. ఈ అంశంలో కోర్టుల జోక్యం ఉండదని జస్టిస్ సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించి వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జూన్ రెండో వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్రం ఆలోచిస్తున్న నేపథ్యంలో, అందులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటను కల్పించాలని కోరారు.

ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ సబ్ కోట అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా మహిళా ఉద్యమాలు ఉధృతమవుతాయని హెచ్చరించారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా రాబోయే సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ సబ్ కోట బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మెండోరా మండల బీసీ అధ్యక్షుడు గుర్రం మహేశ్వర్, బీసీ నాయకులు వడ్ల నారాయణ, మంగలి రాజు పాల్గొన్నారు.