నిరుద్యోగ యువతకు భారీ ఊరట.. వయో పరిమితి 44 ఏళ్లకు పెంపు
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష నియామకాలలో పాల్గొనే నిరుద్యోగ యువతకు కీలక శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయో పరిమితిని మరోసారి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసిన జి.ఓ.ఎంఎస్ నెం.86 ప్రకారం, ప్రస్తుతం ఉన్న 34 సంవత్సరాల గరిష్ట వయో పరిమితిని 44 సంవత్సరాలకు పెంచింది. ఈ సడలింపు ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది.
రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు విడుదల చేసే ప్రత్యక్ష నియామక నోటిఫికేషన్లకు ఈ కొత్త వయో పరిమితి వర్తించనుంది. నిరుద్యోగ యువత నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైలు, అటవీ శాఖల వంటి యూనిఫాం సర్వీసులకు ఈ వయో సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భౌతిక ప్రమాణాలు అవసరమైన పోస్టులకు పాత నిబంధనలే అమల్లో ఉంటాయి.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మరియు ఉపాధీన సేవా నియమాలలోని రూల్–12 ప్రకారం వర్తించే ఇతర వయో సడలింపులు కూడా యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.