బాల్కొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న 99 రోజుల ప్రణాళిక లో భాగంగా శనివారం జలాల్పూర్ లో వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రుద్రూర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పవన్ చంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని రైతులకు పలు సలహాలు సూచనలను అందించారు. భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువుల యాజమాన్యం చేపట్టడం వల్ల రసాయన ఎరువుల పై వృధా ఖర్చును అరికట్ట వచ్చని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తూ జీవ ఎరువుల వినియోగాన్ని పెంపొందించడం ద్వారా నేల ఆరోగ్యంతో పాటు వినియోగదారుల ఆరోగ్యం కూడా మెరుగుపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దిశగా ముందడుగు వేయాలని రైతులను కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు విధిగా రైతు గుర్తింపు కార్డుల నమోదు చేయించుకోవాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అందించనున్న వివిధ సంక్షేమ పథకాల లబ్ధి అందించే విషయం లో ఇది కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ రెడ్డి, ఏవో లావణ్య, ఏఈఓ రేష్మ మరియు రైతులు పాల్గొన్నారు