బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో అత్యంత పురాతనమైన మార్కండేయ మందిరం పునర్నిర్మాణ పనులకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం బాల్కొండ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంఘము సభ్యులు సునీల్ రెడ్డిని కలిసి ఆలయ విశిష్టతను వివరించారు. వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఆలయంలో బ్రహ్మసూత్ర శివలింగం భక్తుల తో పూజలు అందుకుంటున్నదదని పద్మశాలి సంఘం అధ్యక్షులు అందే వెంకటగిరి, కోశాధికారి కుందారపు శ్రీనివాస్ లు సునీల్ రెడ్డికి వివరించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ఇప్పటికే నమూనాలు సేకరించామని అవసరమైన నిధులను మంజూరు చేయించాలని వారు సునీల్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు భూసా రత్నాకర్, ప్రధాన కార్యదర్శి మామిడాల రాజు తదితరులు పాల్గొన్నారు.