subhodayam.news
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 10:35 pm Digital Edition : Narendhar

చర్చలు విఫలమవడంతో… నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్…

రాష్ట్ర ప్రభుత్వంతో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఈ రోజు అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని పలు విధాలుగా కోరిన ఫలితం లేకపోవడంతో గత నెలలో సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదు. తాజాగా టీజీఎస్‌ ఆర్టీసీ జేఏసీ నేతలతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఇవాళ అర్థరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు. బుధవారం ఉదయం షిఫ్ట్ నుంచే కార్మికులు విధులు బహిష్కరించనున్నారు. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి బస్సులు పూర్తిగా నిలిచిపోనున్నాయి.

వేతన సవరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనికి తోడువేతన సవరణ, ఇతర ప్రయోజనాలు కల్పించాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు.

ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఏర్పాటుచేసిన కమిటీ కార్మికుల సమస్య పరిష్కారానికి నాలుగు వారాల గుడువు ఇవ్వాలని సూచించగా కమిటీ ప్రతిపాదనలను జేఏసీ ఒప్పకోలేదు. దీంతో సమ్మె అనివార్యమైందని చెప్పవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా రోజూ లక్షలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు.