subhodayam.news
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 6:13 pm Digital Edition : Narendhar

సిపి రూటే… సెపరేటు…

కళ్ళముందు యముడు కనిపించిన పట్టుకున్న స్టీరింగ్ ఆగదు… కాళ్ల కింద క్లచ్ జోరు తగ్గదు… అదే కనుచూపుమేరలో పోలీస్ కనిపించిన పోలీసు వ్యాన్ కనిపించిన అటు చేతిలో ఉన్న స్టీరింగ్… ఇటు కాళ్ళ కింద ఉన్న క్లచ్ రెండు ఒకేసారి అచేతనంగా కంట్రోల్ కి వస్తాయి…

ఇక్కడే తన ఆలోచనకు పదును పెట్టారు నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. సాయి చైతన్య…జిల్లాలో నేరాల నియంత్రణకు తనదైన శైలిలో పావులు కదుపుతున్న సిపి రోడ్డు ప్రమాదాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగమే ఆయన ఆలోచనలకు రూపు దాల్చింది అరైవ్… అలైవ్… వినూత్న కార్యక్రమం. గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం జిల్లాలో ఊపందుకొంది.

నేషనల్ హైవేలతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు శ్రీకారం చుట్టారు. ఆయా బ్లాక్ స్పాట్ల వద్ద నేరుగా పోలీసు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నట్లు నిలువెత్తు పోలీస్ కటౌట్ ను ఏర్పాటు చేయించారు. ఈ కటౌట్లు అచ్చం పోలీసులు నిలబడినట్లు కనిపించగానే వాహనదారులు తమకు తెలియకుండానే తమ వాహనాల వేగాన్ని నియంత్రించుకుంటున్నారు.

మరోపక్క సిపి సాయి చైతన్య తీసుకొస్తున్న సంస్కరణలు ప్రజల్లోకి, ఇటు సిబ్బందికి ఎప్పటికప్పుడు చేరవేయడంలో అదనపు సిపి బస్వా రెడ్డి తదితర పోలీసు అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు. జిల్లాలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సిపి సాయి చైతన్య కృషిని జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.