న్యూఢిల్లీ: పార్లమెంటులో జరిగిన ఫైనాన్స్ బిల్లు (Finance Bill) చర్చలో భాగంగా రాజ్యసభ సభ్యులు శ్రీ కె.ఆర్. సురేష్ రెడ్డి గారు పాల్గొని, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, రైతాంగ సవాళ్లు మరియు గల్ఫ్ కార్మికుల సమస్యలపై గళమెత్తారు. అంతర్జాతీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రాబోయే మూడు నెలల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని సురేష్ రెడ్డి గారు కోరారు. యూరియా తయారీకి అవసరమైన గ్యాస్ కోసం మనం 90% విదేశాలపైనే ఆధారపడుతున్నామని, గల్ఫ్ దేశాల్లోని ఉద్రిక్తతల వల్ల సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత ఏడాది తెలంగాణలో యూరియా కొరత వల్ల రైతులు ఎదుర్కొన్న లాఠీచార్జ్ వంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, ఎరువుల పంపిణీపై రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సేంద్రీయ ఎరువులు – ‘మిషన్ మోడ్’ ప్రాజెక్ట్: ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. పట్టణాల్లో ఏటా ఉత్పత్తి అయ్యే 30 మిలియన్ టన్నుల తడి వ్యర్థాలను (Wet Waste) శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి సేంద్రీయ ఎరువులుగా మార్చాలని, దీనిని UPI తరహాలో ఒక విప్లవాత్మక ‘మిషన్ మోడ్’ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇది మట్టి సారాన్ని పెంచడమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ఎన్నికల హామీలను చట్టబద్ధం చేయాలని ఆయన ప్రతిపాదించారు.